పన్నెండేళ్ల పాప కన్పించడం లేదు.బిస్కట్లు కొనుక్కుని రావడానికి ఇంటి నుంచి కిరాణా షాపుకు వెళ్లిన పాప ఆ తర్వాత అదృశ్యమైంది.ఇంటికి, కిరాణాషాపుకు మధ్యదూరం 500 మీటర్లు మాత్రమే. వెళ్లిరావడానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు. కానీ పాప వెళ్లి గంటలు గడుస్తున్నాయి.ఆ ఇంట్లో ఆందోళన మొదలైంది.పాప కుటుంబసభ్యులతో పాటు బస్తీవాసులంతా గాలింపు ప్రారంభించారు.‘‘ఏమయ్యా బిస్కట్లు కొనడానికి నీ దుకాణానికే వచ్చింది కదా. ఆ తర్వాత ఎటెళ్లింది?’’ ఎవరో ప్రశ్నించారు.‘‘పాప బిస్కట్లు కొన్నది నిజమే కానీ ఆ తర్వాత ఎటువైపు వెళ్లిందో నేను గమనించలేదు’’ షాపువాడి సమాధానం.పాప ఇంటికి ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్లింది? ఎవరితో వెళ్లింది? అన్నీ అనుమానాలే...సమయం గడుస్తున్న కొద్దీ అందరిలో ఆందోళన పెరిగింది.అప్పటికే రాత్రి పది గంటలవుతోంది...‘‘పోలీస్‌స్టేషన్‌లో రిపోర్ట్ ఇస్తే మంచిది...’’ ఎవరో సూచించారు.
పాప తండ్రి ఖలీల్ రోదిస్తూ భవానీనగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు.ఫఫఫ‘‘సార్... మా అమ్మాయి పేరు రెహనా. 12 ఏళ్లుంటుంది. సాయంత్రం ఐదింటికి ఇంటి నుంచి కిరాణాషాపుకు వెళ్లింది. ఇప్పటిదాకా ఇంటికి తిరిగిరాలేదు...’’‘‘ఎవరైనా తెలిసిన వాళ్లింటికి వెళ్లుంటుందేమో వెతికారా?’’ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.‘‘పాప కోసం అన్ని చోట్లా వెతికాం సార్... అమాన్ నగర్ బస్తీ అంతా గాలించాం. కిరాణాషాపుకు వచ్చి బిస్కట్లు కొన్నట్లు షాపు యజమాని కూడా చెప్తున్నాడు..’’‘‘ఎవరిపైనైనా అనుమానముందా?’’‘‘మాకెవరూ శత్రువులు లేరు సార్...’’వెంటనే కేసు నమోదు చేసుకుని ఆ వివరాలను సౌత్ జోన్ కంట్రోల్ రూమ్‌కు తెలిపి, డీసీపీకి కూడా విషయాన్ని తెలియజేశారు.
ఈలోపు అమాన్‌నగర్ బస్తీవాసులంతా పోలీసుస్టేషన్‌కు వచ్చారు. రెహనాను త్వరగా వెతికి పెట్టమని పోలీసులను అభ్యర్ధించారు.ఫఫఫభవానీనగర్ పోలీసుస్టేషన్ అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతంలో ఉంటుంది.అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దావాలనంలా పాతబస్తీ అంతా వ్యాపిస్తుంది.జనం పెద్దఎత్తున పోలీసు స్టేషన్ వద్ద గుమికూడటంతో మీడియా ప్రతినిధులకు విషయం తెలిసిపోయింది. అంతే...పాప అదృశ్యం వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది.పోలీసుస్టేషన్ వద్ద జనాల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. పన్నెండేళ్ల పాప అదృశ్యం కావడంతో జనం అసహనంగా ఉన్నారు.