విజయవాడ పడమట పోలీస్‌స్టేషన్‌...ఫోన్‌ రింగయ్యింది.రిలాక్స్‌డ్‌గా కూర్చున్న ఇన్‌స్పెక్టర్‌ రవికాంత ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు.‘‘సార్‌... నా భార్య హిమబిందు కన్పించడం లేదు...’’ అవతలి నుంచి ఒక గొంతు ఆందోళనగా వినిపించింది.ఇలాంటి ఫిర్యాదులు పోలీస్‌స్టేషన్‌కు తరచూ వస్తూనే ఉంటాయి. పెళ్లయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రియుడితో లేచిపోవడం, భర్తలు కంప్లయింట్స్‌ ఇవ్వడం... ఇలాంటి కేసులు ఎన్నో.‘‘సార్‌... ఆమె ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది...’’‘‘ఇంతకీ ఎప్పటి నుంచి కనిపించడం లేదు...’’ రొటీన్‌గా ప్రశ్నించారు ఇన్‌స్పెక్టర్‌.‘‘ఉదయం నేను బ్యాంకుకు వెళ్లే సమయంలో ఇంటి బయటకు వచ్చి మరీ టాటా చెప్పింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్లేసరికి ఇంట్లో కనిపించలేదు. బీరువాలో చీరలు, నగలు కూడా కనిపించడం లేదు. ఆమె వేసుకునే చెప్పులు కూడా లేవు...’’‘‘అలాగా... మా కానిస్టేబుల్‌ని పంపిస్తున్నాను వివరాలు చెప్పండి’’ అని అడ్రస్‌ తెలుసుకుని ఫోన్‌ పెట్టేశారు ఇన్‌స్పెక్టర్‌ రవికాంత.

కొద్దిసేపటికే ఇద్దరు కానిస్టేబుళ్లు బ్యాంక్‌ మేనేజర్‌ సాయిరాం ఇంటికి వెళ్లారు.ఎంటీఎస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సాయిరాం ‘సప్తగిరి గ్రామీణ బ్యాంకు’లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.కానిస్టేబుల్స్‌ వివరాలు సేకరించడం ప్రారంభించారు. సాయిరాం చెప్పిన వివరాల ప్రకారం... ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒక కొడుకు చెన్నైలో చదువుకుంటున్నాడు. కుమార్తె కాలేజీలో చదువుతోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కుమార్తెను కాలేజీకి, భర్తను బ్యాంకుకు పంపించింది నడివయస్కురాలైన హిమబిందు. ఆ తర్వాత నుంచి ఆమె కన్పించడం లేదన్న విషయం తెలుసుకున్నారు. మిస్సింగ్‌ కేసుగా రాసుకుని ‘‘సరే... ఎంక్వయిరీ చేస్తాం’’ అంటూ వెళ్లిపోయారు కానిస్టేబుల్స్‌. సాయిరాం ఆమె ఫోన్‌కు కాల్స్‌ చేస్తూనే ఉన్నాడు.

 

కానీ నో రెస్పాన్స్‌...ఆ రాత్రంతా తండ్రీ కూతుళ్లు ఆమె జాడ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.ఆ మర్నాడు చెన్నైలో ఉన్న కొడుకు సెల్‌ఫోన్‌కు హిమబిందు నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.‘‘మీ అమ్మ నాతో పాటు వచ్చేసింది. మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం’’ అని ఆ ఫోన్‌కాల్‌ సారాంశం. వెంటనే తండ్రికి ఆ విషయం చెప్పాడా కుర్రాడు.కొడుకు చెప్పిన విషయం విని సాయిరాం నిర్ఘాంతపోయాడు. పాతికేళ్ల సంసారంలో హిమబిందు ప్రవర్తనను తాను ఎప్పుడూ శంకించలేదు. అలాంటిది... ఇదేంటీ... ఇలా జరిగింది. ‘నేను నమ్మనుగాక నమ్మను’ అనుకుంటూనే తన కొడుక్కు ఫోన్‌ వచ్చిన విషయాన్ని పోలీసులకు తెలిపాడు సాయిరాం.