.‘‘ఏంటీ... సమియాకు క్యాన్సరా?’’ ఆశ్చర్యంగా అంది ప్రియ.‘‘అవునే... ఫేస్బుక్లో ఈ పోస్ట్ చూడు... హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి...’’ అంటూ తన ఫ్రెండ్‌కు వాటిని చూపించింది నవ్య.‘‘పాపం... దానికి ఇంత చిన్న వయసులోనే క్యాన్సరా... అన్బిలీవబుల్...’’ అంటూ తలపట్టుకుంది ప్రియ.‘‘హాస్పిటల్ ఖర్చులకు సాయం కూడా అర్థిస్తోంది. వెంటనే తను ఇచ్చిన అకౌంట్‌కు ఎంతో కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం...’’
‘‘ఓకే. మన ఫ్రెండ్స్‌కు కూడా దీన్ని ట్యాగ్ చేద్దాం. ఎవరెక్కడున్నా విషయం తెలుసుకుని వీలైనంత సాయం చేస్తారు కదా...’’‘‘గుడ్ ఐడియా...’’ అంటూ ఫేస్‌బుక్‌లోని ఆ మెసేజ్‌ను మిగతావారికి ఫార్వర్డ్ చేశారు. వెంటనే చెరో లక్ష రూపాయలు సమియా ఇచ్చిన అకౌంట్ నంబర్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.ప్రియ, నవ్య... అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారిద్దరూ ఒకప్పుడు సమియా క్లాస్మేట్స్.‘‘ఎక్స్‌క్యూజ్‌మీ... పేషంట్ పేరు సమియా... మొన్నే మీ హాస్పిటల్లో క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకుంది. తను ఏ రూమ్‌లో ఉందో చెప్పగలరా?’’ రిసెప్షన్లో ఎంక్వయిరీ చేసింది ఫాతిమా.‘‘పేషంట్‌కు మీరేమవుతారు?...’’‘‘మేమిద్దరం సమియా స్నేహితులం. సౌదీ నుంచి వచ్చాం. ఫేస్బుక్లో విషయం తెలుసుకుని ఉండబట్టలేక వచ్చేశాం...’’
‘‘జస్ట్ ఎ మినిట్...’’ అంటూ ఇన్‌పేషంట్స్ లిస్ట్ చెక్ చేసింది.పేషంట్ పేరు మ్యాచ్ కాలేదు. మరోసారి చెక్ చేసింది.‘‘మేడమ్. సమియా పేరుతో ఎవరూ లేరు...’’‘‘అదేంటీ... ఫేస్బుక్లో తన కేస్ షీట్స్ కూడా పెట్టింది కదా...’’ అంటూ ఫేస్‌బుక్‌లోని ఆ కాపీలను చూపించింది ఫాతిమా.ఆ కేస్షీట్స్ను చెక్ చేసిన హాస్పిటల్ సిబ్బందికి అసలు విషయం అర్థమైంది.
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్...ఫాతిమాతో పాటు ఆసుపత్రి యాజమాన్యం కూడా ఇచ్చిన ఫిర్యాదుతో ఎంక్వయిరీ మొదలెట్టిన పోలీసులకు ఫేస్‌బుక్‌ను అడ్డుపెట్టుకుని సమియా చేసిన మోసం తేటతెల్లమయ్యింది.‘‘ఒకటి కాదు రెండు కాదు... సమియా వసూలు చేసిన మొత్తం నలభై లక్షల రూపాయలకు పైగా అని తేలింది...’’ అన్నాడు క్రైమ్ ఇన్స్పెక్టర్.‘‘అవున్సార్... స్నేహితులతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, సానుభూతిపరులు కూడా ఆమె ఫేస్బుక్లో ఇచ్చిన అకౌంట్లోకి ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేశారు. సమియా అకౌంట్ వివరాలు బ్యాంకు నుంచి సేకరించాం. కానీ అప్పటికే ఆమె ఆ డబ్బు వితడ్రా చేసుకుంది’’ అన్నాడు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై.