ముంబయి శివార్లలోని కాండీవాలీ ప్రజలకు నిత్యం నరకం చూపించే మురికి కాలువ చుట్టూ ముక్కులు మూసుకుని చేరారు జనం పెద్దఎత్తున.మురికినీటిలో రెండు కార్డుబోర్డు బాక్సులు తేలుతున్నాయి. ఒక బాక్సు నుంచి సగం మృతదేహం కనిపిస్తోంది. రెండో బాక్సులో ఏముందో అనే ఆత్రుతతో చూస్తున్నారు.సమాచారం తెలుసుకుని ముంబయి పోలీసులు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు.రెండు బాక్సులనూ బయటకు తీయించారు. రెండో బాక్సులోనూ మృతదేహమే ఉంది. ఒక పురుషుడు, ఒక మహిళ... కాళ్లు చేతులు కట్టేసి, నోటికి టేపు అంటించి, ఎక్కడో హత్య చేసి మృతదేహాలను అట్టపెట్టెల్లో తీసుకొచ్చి ఇక్కడి మురికి కాలువలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు.కంట్రోల్ రూంకు ఫోన్ చేసి మహిళ వయస్సు 40 ఏళ్ల పైన ఉంటుందని, పురుషుని వయస్సు 60కి పైన ఉంటుందని, మిగతా విషయాలతో పాటు ఒంటిపై ఉన్న దుస్తుల వివరాలను కూడా తెలిపారు.
ముంబయిలో ఈ వార్త చాలానే సంచలనం సృష్టించింది. ఎందుకంటే- మృతుల్లో ఒకరు ప్రముఖ ఆర్టిస్టు, జాతీయ లలిత కళా అకాడమి అవార్డు గ్రహీత హేమా ఉపాధ్యాయ. మరొకరు ఆమె న్యాయవాది హరీష్ భంబానిగా తేలింది. వాళ్లిద్దరూ జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న వ్యక్తులు. విషయం తెలుసుకుని ఢిల్లీలో ఉంటున్న హేమ భర్త చింతన్ ఉపాధ్యాయ ఆ మర్నాడే ముంబయి చేరుకున్నారు. ఆయన కూడా పేరున్న పెద్ద ఆర్టిస్టే. దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఉంది ఆయనకు.అయితే కొన్నాళ్లుగా హేమ, చింతన్లు విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్లారు. భరణం కావాలంటూ హేమ వేసిన కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి సమయంలో హేమ మరణించింది. అంతేకాదు ఈ కేసులో హేమ తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ భంబాని కూడా హత్య చేయబడ్డాడు.భర్తే చంపాడా? ముంబయిలో హత్య చేసిన వ్యక్తి ఢిల్లీలో ఎలా ఉన్నాడు? అసలు హత్యలు ఎప్పుడు జరిగాయి? ఎక్కడ జరిగాయి? హరీష్, హేమలు ఒకర్నొకరు ఎప్పుడు కలుసుకున్నారు? ఎక్కడికి వెళ్లారు? ఇలా అన్నీ ప్రశ్నలే.