గోవా పోలీసు కంట్రోల్ రూం...ఆ రోజు హడావుడిగా ఉంది.పొద్దున్నే వచ్చిన ఒక ఫోన్‌కాల్ ఆ హడావిడికి కారణం.ఫోటోగ్రాఫర్, హై ప్రొఫైల్ సెలబ్రిటీ మోడల్ మోనికను ఎవరో ఘోరంగా హత్య చేశారు. గోవాలోని సంగోల్డా ప్రాంతంలో ఉన్న ఫ్లాట్‌లో జరిగింది ఆ హత్య.చేతులు కట్టేసి, బెడ్‌పై నగ్నంగా పడివున్న ఆమె మృతదేహం పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. గోవా డిఐజీ విమల్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.రోజూలాగే ఆ రోజు కూడా ఉదయమే పనిమనిషి వచ్చి కాలింగ్‌బెల్ కొట్టింది. ఎంతకూ తలుపు తెరుచుకోలేదు. దాంతో పొరుగు ఫ్లాట్స్‌లో ఉన్నవారికి, ముంబైలో ఉంటున్న మోనిక అన్న ఆనంద్‌కు పనిమనిషి సమాచారం అందించింది. ఆనంద్ ఫోన్‌కాల్స్‌కు కూడా మోనికా స్పందించలేదు. వెంటనే మోనిక మాజీ భర్త, ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ భరత్ రామామృతానికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.
చివరికి ఒక డూప్లికేట్ కీ సహాయంతో ఫ్లాట్ తలుపు తెరిచి చూసినపుడు అసలు విషయం వెలుగు చూసింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.‘‘ఫ్లాట్‌లో ఎలాంటి దోపిడీ జరగలేదు కాబట్టి తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చు’’ సలిగోవా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ రాయ్ డిఐజీతో అన్నారు.‘‘ హతురాలి ముఖం ఎర్రగా కమిలిపోయి ఉంది. బహుశా ముఖాన్ని దిండుతో అదిమి పెట్టి హత్య చేసి ఉంటారు సార్’’ అన్నాడతను.‘‘ ఓకే. ముందు మోనిక కుటుంబనేపథ్యం తెలుసుకోండి. ఆమె ఎప్పటి నుంచి ఈ ఫ్లాట్‌లో ఉంటోంది? వైవాహిక జీవితం గురించిన వివరాలు కూడా కనుక్కోండి’’ అంటూ డిఐజీ అక్కడి నుంచి కదిలారు.
కొన్ని గంటల తర్వాత ఇన్స్పెక్టర్ రాయ్ పంపిన సీల్డ్ కవర్ విమల్ గుప్తాకు అందింది. ్ఞఅందులో మోనిక వివరాలున్నాయి.నాగపూర్‌లోని ఒక హైప్రొఫైల్ ఫ్యామిలీకి చెందిన యువతి మోనిక. ముంబై జేజే ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీ కోర్సు చేసింది. అనేక మోడలింగ్ షోలలో పాల్గొంది. జీన్ ఫ్రాంకోసిస్, క్రిస్టియన్ లాబోటిన్, ఆనంద్ కాబ్రా లాంటి ప్రముఖ డిజైనర్స్‌తో కలిసి పనిచేసింది. ఆమె స్వంతంగా ‘మో ల్యాబ్’ బ్రాండ్‌తో ఒక ఫెర్ఫ్యూమ్ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొంతకాలం చెన్నైలో నివసించిన తర్వాత గోవాకు మకాం మార్చింది. గత ఏడాది భర్తతో విడిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది. ఇటీవల తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఆమె ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.
వేముల సత్యనారాయణ, 99854 88800