‘‍‘హంతకుడు దొరికాడు. నేరం ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరికింది. ఇంకా నేను పరిశోధించేదేముంది?’’ సూటిగా అడిగాడు డిటెక్టివ్‌ శరత్‌.‘‘హంతకుడు దొరికాడు. కానీ హత్య ఎందుకు చేశాడో చెబుతున్నాడా? నా ఏడేళ్ళ చిట్టితండ్రి జీవితాన్ని ఎందుకని పొట్టనబెట్టుకున్నాడో చెబుతున్నాడా?’’ కోపంగా అడిగాడు శరత్‌ ఎదురుగా కూర్చున్న భాస్కర్‌. అతడి పక్కనే కూర్చున్న అతడి భార్య ఏడవటం మొదలుపెట్టింది.

‘‘వాడు కడుపునొప్పిగా ఉంది స్కూలుకి వెళ్ళను అంటే, నేనే బలవంతాన స్కూలు బస్సు ఎక్కించాను. ఆ బస్సు డ్రైవరే వాడిని చంపుతాడని తెలిసి ఉంటే, స్కూలుకు పంపేదాన్నే కాదు. నా బిడ్డను నేనే బలవంతాన మృత్యుముఖంలోకి నెట్టాను’’ ఏడుస్తూ అంది వసంత. వాళ్ళిద్దరినీ చూస్తుంటే శరత్‌కు జాలిగా అనిపిస్తోంది.వాళ్ళిద్దరి ఏకైక సంతానం అభినవ్‌. అతడు స్కూలుకి వెళ్ళాడు. క్లాసులు ఆరంభమైన కొద్దిసేపటికి టాయ్‌లెట్‌కి వెళ్ళాడు. కాస్సేపటికి మరో పిల్లవాడు టాయ్‌లెట్‌కి వెళ్ళాడు. బాత్రూమ్‌లో రక్తం కారుతూ పడి ఉన్న అభినవ్‌నిచూసి భయంతో కేకలు పెట్టాడు.

ఆ కేకలు విని పరుగెత్తుకు వచ్చిన ఇతర విద్యార్థులు, టీచర్లు ఆంబులెన్స్‌కి ఫోను చేశారు. కానీ ఆస్పత్రికి చేరేసరికే అభినవ్‌ మరణించాడు. బాత్‌రూమ్‌ బయట ఉన్న వీడియోపుటేజీ ద్వారా పోలీసులు, బాత్‌రూమ్‌లో హత్య జరిగిన సమయంలో ఆ పిల్లవాడు కాక మరో వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నారు. అతడే పిల్లవాడిని ఎత్తుకునివచ్చి ఆంబులెన్స్‌లో చేర్చాడనీ తెలుసుకున్నారు. తీరా పరిశోధిస్తే అతడు ఎవరోకాదు, పిల్లవాడిని రోజూ స్కూలుకి తీసుకువెళ్ళే స్కూలు బస్సు డ్రైవర్‌ అని తేలింది. అతడిని అరెస్టు చేశారు.