‘‘ఏమండీ బాబు కన్పించడం లేదు... రెండు గంటలైంది... నాలుగు గంటలకు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పటిదాకా ఇంకా ఇంటికి రాలేదు...’’ అంటూ ఫోన్లో భోరుమంది కరుణ.‘‘చుట్టుపక్కల ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడేమో కనుక్కోకపోయావా...’’ భార్యను సముదాయిస్తూ అన్నాడు రత్నం.‘‘వెదికానండీ... కనిపించలేదు. నాకెందుకో భయంగా ఉంది’’ కరుణ ఇంకా ఏడుస్తూనే ఉంది.‘‘కంగారుపడవద్దు..నేను వెంటనే వస్తున్నా...’’ అంటూ డ్యూటీ నుంచి హడావిడిగా ఇంటికి బయలుదేరాడు రత్నం.తిరుపతిలోని సత్యనారాయణపురంలో ఒక చిన్న బస్తీ అది...అక్కడ మధ్యతరగతి వారే ఎక్కువగా ఉంటారు.తిరుమల తిరుపతి దేవస్థానంలో అటెండర్‌గా పనిచేస్తున్న రత్నం అక్కడే ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆయనకు భార్య కరుణ, కుమారుడు రవి, కుమార్తె హిమ ఉన్నారు. ముచ్చటైన కుటుంబం వారిది. ఏ చీకూచింత లేదు. రత్నం పిల్లలిద్దరూ స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు పదేళ్ల రవి. ఎప్పుడు మాయమయ్యాడో మాయమయ్యాడు. రవి కన్పించని విషయాన్ని ముందుగా తల్లి కరుణే గుర్తించింది.‘‘కిరాణా షాపుకు పంపిద్దామని రవిని పిలిస్తే ఎంతసేపటికీ రాలేదు. బయటకు వచ్చి చూస్తే పిల్లోడు కన్పించలేదు. వాడితో అప్పటివరకు ఆడుకుంటున్న పిల్లలంతా ఇప్పటివరకు రవి తమతోనే ఉన్నాడని ఎక్కడికెళ్లాడో చూడలేదని చెప్పారు’’ భర్తకు విషయం చెప్పింది కరుణ.‘‘నేను చూసి వస్తానుండు...’’ అంటూ కొడుకును వెతకడానికి బయటికి వెళ్లాడు రత్నం.
పనిలోపనిగా రాజుకు ఫోన్ చేసి విషయం వివరించాడు.రాజు ఆటోడ్రైవర్. రత్నం ఇంటి సమీపంలోనే ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. రత్నం పిల్లలకు రాజు భార్య రజని ట్యూషన్ చెబుతుంది. రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఒకరికొకరు చేదోడుగా ఉంటారు.రత్నం ఫోన్ చేసిన కొద్దిసేపటికే రాజు ఆటోలో సత్యనారాయణపురం వచ్చేశాడు. రత్నం చెప్పిందంతా విన్న రాజు ‘‘ఏం భయపడకన్నా... పిల్లోడు ఏడికి పోతాడు.. వెతుకుదామం’’టూ తన ఆటో ఫ్రెండ్స్ చాలామందికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత రత్నంని ఆటోలో ఎక్కించుకుని చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో వెతకడం మొదలు పెట్టాడు.