కడప పట్టణం అట్టుడికిపోతోంది.ఫ్యాక్షన్ ఖిల్లాలో రాటుదేలినవాళ్లే ఆ విషయం తెలుసుకుని ఖంగుతిన్నారు.ఇక సామాన్యుల సంగతి చెప్పక్కర్లేదు.వందలాదిగా జనం అక్కడికి చేరుకున్నారు.వరదలా వస్తున్న జనసమూహాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఆ హడావుడంతా జరుగుతోంది ఒక పాఠశాల దగ్గర.ఇంతలో...సైరన్‌తో జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ కారు సర్రున దూసుకొచ్చి అక్కడ ఆగింది.ఎస్పీ రాకతో పోలీసుల హడావుడి ఎక్కువైంది.ఎస్పీ నేరుగా స్కూలు ప్లేగ్రౌండ్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఎస్పీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎస్పీ రాకని గమనించి ఒక జీపులో అప్పటివరకు కూర్చోపెట్టిన వ్యక్తిని పోలీసులు కిందకు దింపారు.కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి ఉన్నందువల్ల మెల్లిగా నడుస్తూ ఎస్పీ ముందుకు వచ్చాడా వ్యక్తి.అతడ్ని నఖశిఖ పర్యంతం చూసిన ఎస్పీ ‘‘ఏరా... ఎక్కడున్నాయిరా శవాలు? తమాషా చేస్తున్నావా? పిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండ్‌లో డెడ్‌బాడీస్ ఉన్నాయంటావా? ఏదీ చూపించు...’’ అంటూ అతడ్ని ముందుకు తోశారు.ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో కలిసి ముందుకెళ్లిన ఆ వ్యక్తి ప్లేగ్రౌండ్‌లో ఒక చోటికి చేరుకున్నాడు.ఎస్పీతో పాటు పోలీసులు అతడి చర్యను నిశితంగా పరిశీలిస్తున్నారు.కాసేపు నిలబడ్డాక వేలును నేలవైపు చూపిస్తూ గుండ్రంగా తిప్పి అక్కడ తవ్వండని సైగ చేశాడు.
‘‘అతడు చూపిస్తున్న ప్రదేశంలో తవ్వండి’’ కూలీలను పురమాయించారు ఇన్స్పెక్టర్.వెంటనే కూలీలు పలుగు, పారకు పనిచెప్పారు.నిమిషాలు గడుస్తున్నాయి...కొద్దిసేపటి తర్వాత దుర్వాసన ప్రారంభమైంది.అక్కడున్నవారంతా ముక్కుకు కర్చీఫ్‌లు అడ్డుపెట్టుకున్నారు. వాసన వస్తోందంటే, అక్కడేదో మృతదేహం ఉందన్నమాటే.పోలీసుల సూచనతో కూలీలు మెల్లిగా మట్టి తీయడం ప్రారంభించారు.మరికొన్ని నిమిషాలకు ఆ గొయ్యి నుంచి ఒక అస్థిపంజరం బయటపడింది.‘‘సార్... ఇక్కడ ఒక అస్థిపంజరం ఉంది’’ అరిచాడో కానిస్టేబుల్.కానిస్టేబుల్ అరుపు విన్న వెంటనే ఎస్పీ గులాటీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు గొయ్యి వద్దకు చేరుకుని బయటకు తీసిన అస్థిపంజరాన్ని పరిశీలించారు.‘‘ఈ అస్తిపంజరం మగవ్యక్తిది’’ అక్కడున్న వైద్యులు నిర్ధారించారు.గొలుసులతో బంధింపబడిన ఆ వ్యక్తి వద్దకు వచ్చిన ఒక పోలీసు అధికారి ఆగ్రహంతో ఊగిపోతూ లాగిపెట్టి చెంపమీద కొట్టారు.‘‘ఏరా అంజీ... ఏంటిది... ఇంకా ఎవరినైనా చంపావా...’’