‘‘రేయ్ మనోజ్... కొత్త గేమ్ వచ్చింది. నిన్ననే గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేశా. భలేగుందిరా ఆ గేమ్. నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకో’’ వాట్సాప్‌లో రవి మెసేజ్.ఆన్లైన్ గేమ్‌ల పిచ్చివాడైన మనోజ్ వెంటనే రవి చెప్పినట్లు టాప్‌గన్ గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. వాడు చెప్పినట్టు నిజంగానే వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. టాప్‌గన్ యాప్ ద్వారా గన్ ఫైరింగ్ చేస్తూ, టార్గెట్‌ను హిట్ చేస్తూ గేమ్‌లో మునిగితేలాడు మనోజ్.
రవి, మనోజ్ లెక్చరర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరికీ ఆన్లైన్ గేమ్‌లంటే బాగా ఇష్టం. కొత్త గేమ్స్ ఏవొచ్చినా వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఆడుతుంటారు. లెక్చరర్ ఉద్యోగం కావడంతో తీరిక ఎక్కువగానే దొరుకుతుంది. స్మార్ట్‌ఫోన్‌లోనే వివిధ బిల్లులు కట్టడం, టికెట్లు బుక్ చేసుకోవడం వంటి సమస్త పనులూ చేస్తుంటారు. అన్ని బ్యాంకుల యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని ఆర్థిక లావాదేవీలు కూడా ఆన్లైన్లో నిర్వహిస్తుంటారు.ఫ ఫ ఫమనోజ్ హడావిడిగా పరిగెత్తుకుంటూ రవి ఇంటికి వచ్చాడు.‘‘రేయ్ రవీ... నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అయ్యింది. అన్ని ఖాతాల్లోంచి డబ్బులు ఎవరో డ్రా చేశారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు’’ అన్నాడు కంగారుగా.
‘‘అదేంటీ... నువ్వు చాలా క్రిటికల్ పాస్వర్డ్ ఉపయోగిస్తావు కదా. బ్యాంకు ఖాతాలు ఎలా హ్యాకయ్యాయి’’‘‘అదేరా నాక్కూడా అర్థం కాలేదు....’’‘‘నువ్వు కంగారుపడకు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు చెబుదాం...’’ అంటూ ఆయన నెంబర్ కోసం సెర్చ్ చేయడం మొదలెట్టాడు.అంతలోనే రవి ఫోన్‌కు వరుసగా ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే రవికి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి కూడా డబ్బు మాయమై నట్టుగా ఆ ఎస్సెమ్మెస్‌ల ద్వారా తెలిసింది.ఒక్కసారిగా షాక్‌కు గురైన రవి ‘‘అదేంట్రా... నీలాగే నాక్కూడా జరిగింది. రెండు లక్షల రూపాయలు పోయాయి’’ అంటూ బిక్కమొహం పెట్టి మెసేజ్‌లు చూపించాడు.ఫ ఫ ఫసైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్...ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ‘‘అదేంటీ మీ ఇద్దరి బ్యాంకు ఖాతాలు ఒకసారే హ్యాక్ అయ్యాయి’’ అన్నాడు.