‘‘శ్రీనివాస్... ఏంటి ఇంకా కొరియా కంపెనీ నుంచి డబ్బు రాలేదా?’’‘‘ ఇంకా రాలేదు సార్...’’‘‘ అదేంటీ... కన్సైన్మెంట్ డెలివరై దాదాపుగా నెల దాటిపోయింది కదా...’’ కాస్త విసుగ్గానే అన్నాడు ఎండీ సుధాకర్.‘‘ బ్యాంక్ స్టేట్మెంట్ చూశాను సార్... మామూలుగా వాళ్లు సరుకు అందిన రెండు వారాల్లో డబ్బు పంపిస్తారు. ఈసారి ఎందుకో ఆలస్యమైంది...’’‘‘ అర్జెంట్‌గా ఒక మెయిల్ పెట్టు...’’‘‘ ఓకే సార్...’ అంటూ సిస్టమ్ ఆన్ చేశాడు శ్రీనివాస్.సరుకు పంపించి నెలరోజులు దాటిందని, తమకు రావాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా అందలేదని, త్వరగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని వెంటనే కొరియా కంపెనీకి మెయిల్ పెట్టాడు.కొద్దిసేపటికే కొరియా కంపెనీ నుంచి రిప్లై వచ్చింది. ఆ మెయిల్ చూసి కంగు తిన్నాడు శ్రీనివాస్. మీ సరుకు అందిన వెంటనే ఎప్పటిలాగే 3.5 కోట్ల రూపాయలను మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశామని ఆ మెయిల్లో ఉంది.
అంతేగాక ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్లు.‘డబ్బు అందకపోగా... తమ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశామంటూ ట్రాన్సాక్షన్ నెంబర్ వచ్చిందేమిటా’ అనుకుంటూ బ్యాంక్ స్టేట్మెంట్ కాపీని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాడు శ్రీనివాస్. ఎక్కడ కూడా ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నెంబర్‌కు మ్యాచ్ అవుతూ 3.5 కోట్ల రూపాయలు తమ ఖాతాలో పడినట్లులేదు.కొరియా కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ తీసుకుని ఎండీ ఛాంబర్లోకి వెళ్లాడు.
మెయిల్ చూడగానే సుధాకర్ ముఖంలో రంగులు మారాయి.‘‘అదేంటీ... వాళ్లు ప్రతీసారి మనకు పంపించే అకౌంట్ నెంబర్‌తో కాకుండా మరో అకౌంట్ నెంబర్‌కు డబ్బు ఎందుకు పంపారు...’’‘‘ అవున్సార్... అదే నాకు అర్థం కాలేదు. అసలు ఆ అకౌంట్ నెంబర్‌తో మన ఫర్మ్ ఖాతా ఎక్కడా లేదు కూడా...’’‘‘ ఎక్కడో ఏదో జరిగింది. వాళ్లతో డైరెక్ట్‌గా మాట్లాడదాం...’’ అంటూ కొరియా కంపెనీ పెద్దలకు ఫోన్ కలిపాడు.ఫోన్లో వారు చెప్పిన విషయాలు విని సుధాకర్‌కు చెమటలు పట్టాయి.‘‘శ్రీనివాస్... మనం మోసపోయాం. మనల్ని ఎవరో నిండా ముంచేశారు. అర్జెంట్‌గా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’’ అంటూ హడావిడిగా సుధాకర్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు.