ఆ వార్త వినగానే ఐటీ సిటీ బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది...ఐటీ కారిడార్‌లో ఉన్న సంస్థల్లో నిశ్శబ్దం నెలకొంది.కంప్యూటర్లు, లాప్‌టాప్‌లపై టకటకలాడిస్తున్న వేళ్లు ఒక్క నిమిషం ఆగిపోయాయి.‘డెల్’ ఉద్యోగిని పాయల్ సురేఖను గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్‌లో హత్య చేశారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది.జేపీ నగర్‌లోని అపార్ట్మెంట్ ...బయట జనాల్ని పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. అప్పటికే వందల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు.
‘నగరం నడిబొడ్డున పట్టపగలే హత్య జరిగింది. ఈ నగరంలో మహిళలకు రక్షణ లేదా?’ అంటూ వారంతా నినదిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు నగర పోలీస్ కమిషనర్ శంకర్ బిదిరికి సమాచారం అందించారు.మరికాసేపటికి పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. జేపీనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రంజిత కమిషనర్‌ను ఫ్లాట్‌లోకి తీసుకెళ్లారు.బెడ్‌పైన రక్తపుమడుగులో నిర్జీవంగా కనిపించింది సురేఖ. ఆమె మెడను కత్తితో కోశారు.
శరీరం నిండా అనేక కత్తిపోట్లు. ఆమె ఒంటి మీదున్న లంగా, షర్ట్ రక్తంతో పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి.‘‘సార్... ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఈ ఫ్లాట్‌లో గత నాలుగు నెలలుగా ఒంటరిగానే ఉంటోందట...’’ అప్పటిదాకా తెలుసుకున్న సమాచారాన్ని కమిషనర్‌కు చెప్పాడు ఇన్స్పెక్టర్ రంజిత.‘‘ఆమె తల్లిదండ్రులు, భర్త ఎక్కడుంటారు?’’‘‘పేరెంట్స్ అసోంలో, హస్బెండ్ కటక్‌లో ఉంటారట...’’‘‘వారికి మెసేజ్ వెళ్లిందా?...’’‘‘కొలీగ్స్ మెసేజ్ పంపారట. రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకోవచ్చు...’’‘‘ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఎంక్వయిరీ మొదలెట్టండి... క్రైమ్‌సీన్ చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తే హత్యకు పాల్పడినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ కొన్ని సూచనలిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు కమిషనర్.సురేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరులోని కెంపగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు పోలీసులు.
బెంగళూరు నగర పోలీసు కార్యాలయంలో సురేఖ హత్య కేసు సమీక్ష ప్రారంభమైంది.‘‘సార్... సురేఖ భర్త అనంతనారాయణ మిశ్రా కటక్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడని, ఆమె డెల్ కంపెనీలో నాలుగు నెలల కింద ఉద్యోగంలో చేరిందని ఎంక్వయిరీలో తేలింది’’ అని ఇన్స్పెక్టర్ రంజిత్ కమిషనర్‌కు వివరించాడు.‘‘హత్య జరిగింది బెడ్ రూంలో. అయితే కిచెన్‌లోని సింకులో రెండు కాఫీ కప్పులున్నాయి. హత్యకు ముందు ఆమె ఎవరితోనో కలిసి కాఫీ తాగింది. అంటే ఈ హత్య ఆమెకు బాగా తెలిసినవారే చేశారని తెలుస్తోంది’’