పరుగుపరుగున ఆరేళ్ళ విక్కీకుమార్‌ని సైనిక ఆసుపత్రికి తరలించారు. రక్తం ఓడుతున్నాడు. ఊపిరి ఆడుతోంది. బ్రతుకుతాడో లేడో చెప్పలేని స్థితి. తెల్లగా రబ్బరు బొమ్మలాగా ఉన్న వాడు ఎర్రటి రక్తం తలనించి కారుతూ వాడిని రక్తపు బొమ్మగా మార్చేసింది... తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు... గత కొద్దినెలలుగా ఇలాంటి దృశ్యాలు అక్కడ సామాన్యం. ఎవరూ ఏం చెయ్యలేని పరిస్థితి.

‘ఉదయం నుంచి లోపలే ఉన్నాడు. ఇప్పుడే బయటకు వచ్చి చెట్టుదగ్గర ఆడుకుంటున్నాడు. ఇలా జరిగింది దేవుడా’ అని విక్కికుమార్‌ తల్లి రిమ్య ఏడుస్తూ చెబుతోంది.విక్కి కుమార్‌ని ఆసుపత్రి ధియేటర్‌ లోపలికి తీసుకుపోయారు సిబ్బంది. డాక్టర్లు చూసారు. వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాట్లుచేసారు.‘ఇది ఎంతకాలమో తెలియదు. మనకి ఈ కష్టాలు తప్పడం లేదు’ అని ఏడుస్తూ బెంచి మీద కూలబడ్డాడు విక్కీకుమార్‌ తండ్రి కరణ్‌.ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో, ఆపరేషన్‌ ధియేటర్‌లో డాక్టర్లు, నర్సుల హడావుడిగా తిరుగు తున్నారు. అక్కడక్కడ కొంతమంది పేషెంట్లు కూర్చుని ఉన్నారు. వారందరూ సైనికులే. కొంతమంది సివిల్‌ దుస్తుల్లో ఉన్నారు. పదవీ విరమణ చేసిన వృద్ధులు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆసుపత్రి శుభ్రంగా ఉంది.

ఫినాయిల్‌ వాసన అన్నివైపుల నుంచి వస్తోంది.తలలు కిందికి వాల్చి ఒకరిపక్కన ఒకరు కూర్చుని ఉన్నారు విక్కీకుమార్‌ తల్లిదండ్రులు. ఆసుపత్రి బయట వారితో మనుషులు ఉన్నారు. వాళ్ళంతా ఆ గ్రామం వారు. వాళ్ళంతా కొరటాన్‌కు చెందినవారు. కొరటాన్‌ గ్రామంకు మూడు వైపులా పాకిస్తాన్‌ సరిహద్దు ఉంది. పాక్‌ కాల్పులకు తెగబడిన ప్రతీసారి ఆ గ్రామంలో మూడు వైపుల నుంచి తూటాల, బాంబుల వర్షం కురుస్తుంది. ప్రజలు వెంటనే బంకర్లలోకి పరుగులు తీయకుంటే ప్రాణాలు కోల్పోవలసిందే. ఇటీవల దాడుల్లో కొరటాన్‌ గ్రామంపై పాకిస్తాన్‌ మోర్టార్లతో విరుచుకు పడింది. ఏభై ఇళ్ళు కాలిపోయాయి.

ప్రజలు రోజుల తరబడి బంకర్లలో తలదాచుకుని ప్రాణాలు దక్కించుకుంటున్నారు.పెద్దపెద్ద తెల్లటి మీసాలతో, పంజాబీ తలపాగాతో అక్కడ కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు విక్కికుమార్‌ తండ్రి కరణ్‌ని అడిగాడు.‘ఎలా జరిగింది?’ అని.‘మేం బీహార్‌ నుంచి వచ్చాం. కూలిపనుల కోసం వచ్చాం. లాల్‌యాల్‌లో ఉంటున్నాం. రాత్రంతా బంకర్లోనే ఉన్నాం. ఇందాక సాయంత్రం నా కొడుకు ఆడుకోవడానికి బయట కొచ్చాడు. పాక్‌ వాళ్ళు వేసిన మోర్టార్‌ తగిలి పడిపోయాడు. ఏం జరుగుతుందో ఏమో.. నా కొడుకుని ఆ భగవంతుడే రక్షించాలి’ అంటూ కళ్ళ నీళ్ళు తిప్పుకున్నాడు.