మణిపురంలో వృద్ధ అనే పేరుగల శిల్పి ఉండేవాడు. పేరుకి తగినట్టుగానే అతనికి ఎనభై ఏళ్ళు. భార్య, మనుమడు సహా చిన్న గుడిసెలో నివసించేవాడతను. వృద్ధ మనమడు పేరు ధర్మ. వాడి వయసు ఎనిమిదేళ్ళు. చిన్నతనంలోనే వాడి తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి తాత-నాయనమ్మలే వాడికి తల్లిదండ్రులయ్యారు. సన్నగా, బలహీనంగా ఉండేవాడు ధర్మ. తోటిపిల్లలతో ఆడుకునేవాడు కాదు. తాతతోనే ఉండే వాడెప్పుడూ. తాతసహా గుట్టల్లో తిరిగేవాడు. శిల్పాలకోసం తాత రాళ్ళను చదును చేస్తుంటే, వాటిని ముక్కలు చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతూ ఆడుకునేవాడు. ఉలినీ, సుత్తినీ తీసుకుని, చిన్నచిన్న బొమ్మలు చెక్కేవాడు ధర్మ. మట్టితో కూడా బొమ్మలు చేసేవాడు. ఆ బొమ్మల్ని తాతకి చూపించి, ఎలా ఉన్నాయ్‌? అని అడిగేవాడు. బాగున్నాయంటూ తాత పొంగిపోయి, బుగ్గన ముద్దు పెడితే, ఛీ! తడి అని తుడుచుకునేవాడు ధర్మ.

‘‘ఎప్పటికైనా నా మనవడు గొప్ప శిల్పి అవుతాడు. మహారాజు అవుతాడు.’’ అనేవాడు వృద్ధ. ఆ మాటలకి ఆశ్చర్యపోయేది అతని భార్య. అడిగేదిలా.‘‘గొప్ప శిల్పి అవుతాడు అన్నావు బాగుంది, కులవృత్తి కాబట్టి అయితే అవుతాడు. ఆశ్చర్యం లేదందులో. మహారాజు ఎలా అవుతాడయ్యా?’’‘‘కాలం కలిసొస్తే అవుతాడే.’’ అనేవాడు వృద్ధ.‘‘అప్పుడు కూడా ఈ మహారాజు నా ఒళ్ళోనే పడుకుంటాడా?’’ అని దూరంగా పడుకున్న ధర్మను దగ్గరగా లాక్కొని నవ్వేది నాయనమ్మ. వాడికి నిద్రపట్టేందుకు పాటలు పాడేది. కథలు చెప్పేది. కథలు వింటూ అందమైన దృశ్యాలను ఎన్నెన్నో ఊహించుకునేవాడు ధర్మ. ఆ దృశ్యాలను శిల్పాలుగా చక్కగా చెక్కాలనుకునేవాడు. తెల్లారి తాతతో గుట్టల దగ్గరకి వెళ్ళినప్పుడు, ఆ ప్రయత్నంలోనే క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. చకాచకా బొమ్మల్ని చెక్కి, తాతకి చూపించేవాడు. శభాష్‌ అనిపించుకునేవాడు.మణిపురాన్ని భువనేశుడు పాలించేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు. ఆ పిల్ల పేరు బుద్ధి. ఆరేళ్ళుంటాయి ఆమెకు.బుద్ధి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాదీ విందు ఏర్పాటు చేస్తున్నాడు రాజు. గత అయి దేళ్ళుగా పెద్ద ఎత్తున విందు నడుస్తోంది. ఆ విందుకు మంత్రి సామంతులందరినీ పిలవడం, ఆనందించడం రాజుకి అలవాటు. ఈసారి కూడా విందు ఏర్పాటు చేశాడు రాజు. బుద్ధి పుట్టినరోజును పండుగలా చేస్తున్నాడతను.