‘‘ఆన్‌లైన్లో నాకొక విన్స్ కమూటో ఆర్డర్ పెట్టావంటే నీక్కావాల్సిన పని చక్కబెట్టేస్తానబ్బాయ్’’ షాపింగ్ సైట్స్ బ్రౌజ్ చేస్తూ సీరియస్‌గా చెప్పింది హసిత.విన్స్ కమూటో అనే పేరే ఎప్పుడూ విన్లేదు నేను. ఏం చేస్తారు దానితో? తింటారా, తాగు తారా, తొడుక్కుంటారా, తగిలించుకుంటారా? కుర్చీ పక్కకి జరుపుకొని, తన మొబైల్లోకి తొంగిచూశాను. విన్స్ కమూటో అంటే హ్యాండ్‌బ్యాగ్ అన్నమాట. రేటు కూడా ఎంతో లేదు. జస్ట్ ఇరవైరెండు వేలు. నా నెల జీతానికి మూడువేలు తక్కువ. నా గుండె వొక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకోవడం మొదలైంది.‘‘కావాలంటే లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా వుండి పోతా. ఇంత ఖరీదైన సహాయాలు నాకొద్దు.’’‘‘అరే, కత్తిలాంటి అమ్మాయిని పడెయ్యాలంటే ఆమాత్రం ఖర్చవదా మావా బ్రో. తొందరేం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకో. ఐ కెన్ బీ యువర్ పర్సనల్ వింగ్ గర్ల్. ఒక్క విన్స్ కమూటోతో నీ లైఫ్ మారిపోద్ది.’’‘‘ఎంత పెద్ద ఫేవర్ అయినా అంత బిల్లు నేను తట్టుకోలేను. నన్నొదిలెయ్.’’‘‘మోస్ట్ అన్ రొమాంటిక్ ఫెలో. మన పక్క బిల్డింగ్‌లో వుండే స్టార్టప్ కంపెనీలో వరుణ్ అని వొకడు మొన్నే చేరాడు. పార్కింగ్‌లో కలిస్తే హాయ్ చెప్పాలే. నంబర్ ఎలా పట్టాడో ఏంటో... తెల్లారే పింగ్ చేశాడు. అది కూడా మిడ్‌నైట్. ఫుల్లు స్లీపులో వున్నాలే గానీ, అలా పడుంటాడని రెండు స్మైలీలు పడేశా. వాడికున్నపాటి ఎంతూజియాజం లేదు నీకు’’ నిరాశ నటిస్తూ చెప్పింది.పర్సనల్ వింగ్ గర్ల్ అంటే ఏంటో నాకు తెలీదు. హసిత వెళ్లిపోయాక గూగూల్ చేసి చూశాను. ఇద్దరి మధ్య ఆకర్షణ పెరగడానికి సహాయం చేసే ఫీమేల్ ఫ్రెండట. అలాంటి సపోర్ట్ యిచ్చేవాళ్లు వుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వాళ్లకి ప్రత్యేకంగా వొక పేరుండడం మాత్రం విడ్డూరమే. ‘గొప్పోళ్లురా బాబూ మీరు’ అనుకున్నాను అమెరికన్లని తల్చుకొని.హసిత, నేను దాదాపు వొకేసారి ఇన్‌టర్స్న్‌గా జాయిన్ అయ్యాం. తను హెచ్చార్, నేను ఆపరేషన్స్. నాకన్నా రెండువారాలు సీనియర్ తను. ఫస్ట్ డే తనే పరిచయం చేస్కొని, ఆఫీసంతా తిప్పి చూపించింది. సిటీలైఫ్ నాకు అలవాటు లేదు. హసిత కంపెనీ లేకపోతే నాకు వూపిరి కూడా ఆడుండేది కాదు. వారం తిరిగేసరికి యిద్దరం కలిసి రెస్టారెంట్‌లు, సినిమా హాళ్లు చుట్టేయడం మొదలెట్టాం. ఆర్నెళ్లు అయ్యేసరికి అసలు నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగానేమో అనిపించిందంటే అది తన వల్లే. తిరనాళ్లలో చిన్నపిల్లలు తప్పి పోకుండా, వాళ్ల రెక్క పట్టుకొని లాక్కెళ్లే ఆరింద లాంటిది హసిత. నాకు ఏం యిష్టమో తనెప్పుడూ అడగలేదు. నాకేది అవసరమో తనకి తెలుసని నాకు నమ్మకం కుదిరాక, తను అడగకపోవడం నాకు ప్రాబ్లమ్ కాలేదు.
*********************************************