బుస్సి అరుస్తూ తను పడుకున్న సోఫాకింద నుంచి బయటకు వచ్చింది.ఆ అరుపులకు ఉలికిపడి మగత నిద్రలోంచి మేల్కొన్నాడు బాబూరావు.బుస్సి అరుస్తూ, తోకాడిస్తూ ఫ్లాట్‌ ముఖద్వారంవైపు పరుగెడుతోందంటే ఎవరో తెలిసినవాళ్ళు వస్తున్నట్టు లెక్క! ఆ ఇంటిల్లిపాదికి దాని భాష తెలుసు! ఇంట్లో వాళ్ళెవరైనా వస్తున్నారంటే వాళ్ళు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్నప్పటినుంచే బుస్సి తన స్థావరం సోఫా క్రిందనుంచి గేటువైపు వెళ్ళి పైపైకి ఎగురుతూ గారాలుపోతున్నట్టు ఆగాగి అరుస్తుంది!

అదే అంతకుముందు ఆ ఇంటికి వచ్చినవాళ్ళెవరైనా వస్తుంటే తోకాడిస్తూ గేట్‌వైపు పరుగెడుతుంది ఆహ్వానం పలుకుతున్నట్టు! అదే కొత్తవాళ్ళు అటుగా వస్తున్నట్లు పసిగడితే భయంకరంగా అరుస్తూ గేట్‌వైపు పరుగెడుతుంది.తోకాడిస్తూ గేట్‌వైపు పరుగెత్తిందంటే ఎవరో తెలిసిన వాళ్ళొస్తున్నారని అర్థం చేసుకున్నాడు బాబూరావు. బుస్సి అరుపులు అర్థం చేసుకుని, అతని మనుమరాలు సుమ లోపలినుంచి పరుగెత్తుకొచ్చింది ‘బుస్సీ’ అంటూ. సుమ ఒకటవ తరగతి చదువుతోంది.‘‘అమ్మా! ఎవరో వచ్చినట్లున్నారు బయటిగేట్‌ తలుపులు తెరువమ్మా’’ బాబూరావు నోటినుంచి వచ్చిన మాటలు పూర్తికాకుండానే కాలింగ్‌బెల్‌ మోగింది.బుస్సి వచ్చే వాళ్ళని స్వాగతిస్తున్నట్లు తోకాడిస్తూ ముందుకాళ్ళతో పైపైకి లేస్తూ అరవ సాగింది.

‘‘బుస్సీ! గివ్‌ ద వే!’’ కాస్త కోపంగా అరిచింది సుమ. దానిని పట్టుకుని ఇవతలికి లాగుతూ ‘‘లోపలికి రండి పెద్దమ్మా. బుస్సీ మిమ్మల్ని గుర్తుపట్టింది. ఆ తోకని చూడండి ఎలా ఊపుతోందో!’’ అనడంతో బుస్సీ అరుస్తున్నా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టింది రాజ్యలక్ష్మి.హాల్లోకి అడుగుపెట్టిన ఆమెని చూస్తూనే తన మంచం మీద లేచి కూర్చుని ‘‘రామ్మా లోపలికి’’ అని ఆప్యాయంగా పలకరించాడు బాబూరావు.బుస్సి ఆమెని పలకరించినట్లు మరోసారి రాజ్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి వాసనచూసి, సోఫాకింద తన స్థావరంలోకి వెళ్ళిపోయింది.