ప్రతి మనిషికీ కీర్తికాంక్ష ఉంటుంది. అందరిలోనూ గొప్పవాడనిపించుకోవాలనుకుంటాడు. ఓ రచయిత కూడా అలాగే ఆ ఊళ్ళో గొప్పవాడని పేరు తెచ్చుకున్నాడు. సేవాతత్పరుడయ్యాడు. క్షణం విశ్రాంతి, తీరిక లేకుండా కూరిమీదే గడిపేవాడు. భార్యా ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఓ స్నేహితుడు అతడిని నిశితంగా గమనించి శాస్త్రీయమైన రుజువులతో అతడి కీర్తికాంక్షను బైటపెట్టాడు. అతడెందుకలా చేశాడు?

సెల్‌ఫోన్‌ మోగగానే ఆన్‌చేసి ‘‘హల్లో’’ అన్నాడు సోమేశ్వర్‌.‘‘నమస్కారం సార్‌! నేను చెన్నైనుంచి కమలాకర్‌ను మాట్లాడుతున్నాను. ఫ్రీగా ఉన్నారా సార్‌...రెండు నిమిషాలు మాట్లాడొచ్చా...’’ అన్నాడు అవతలి వ్యక్తి.‘‘మాట్లాడొచ్చు..’’ అన్నాడు సోమేశ్వర్‌.‘‘నేను మీ అభిమానిని సార్‌, మీరు రాసిన నవలలన్నీ చదివాను. నేనిక్కడ ఓవర్సీస్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మీరు ఈ నెల 16వ తేదీనాడు ఫ్రీగా ఉన్నారా సార్‌?’’‘‘ఏమిటి విశేషం?’’‘‘నేను రాసిన నవలను ఇక్కడ ఆరోజు మీ చేతులమీదుగా ఆవిష్కరింపజేసుకోవాలని నాకోరిక సార్‌! మీకారోజు చెన్నైకి రావటానికి వీలౌతుందాసార్‌? మీకిక్కడ మంచిహోటల్లో బస ఏర్పాటుచేస్తాం, రానుపోను ప్రయాణఖర్చులిస్తాం. మీరిక్కడున్నంతసేపూ మీకెలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం’’ అన్నాడతను.

‘‘ఇక్కడ నాకు వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 16వతేదీ వీలౌతుందో లేదా నా డైరీ చూస్తేగాని చెప్పలేను’’ అన్నాడు సోమేశ్వర్‌.‘‘నేను మళ్ళీ అరగంట తర్వాత ఫోన్‌ చేస్తాను సార్‌. మీరు డైరీచూ‍సి చెప్పండి. మీరు తప్ప కుండా రావాలిసార్‌. మిమ్మల్ని చూడాలని, మీతో కొన్నిగంటలు గడపాలని ఎంతగానో అనుకుంటున్నాను. చెన్నైలో నేనేకాదు, మీ అభిమానులు చాలామంది ఉన్నారు. మీరొస్తే అందరూ చాలా సంతోషిస్తారు సార్‌!’’ అన్నాడతడు.‘‘చూద్దాం..వీలౌతుందో లేదో, చెన్నైకి రావాలని నాకూ ఉంది, సరే అరగంట తర్వాత ఫోన్‌ చెయ్యండి, డైరీ చూసి చెబుతాను’’‘‘అలాగే సార్‌!’’ అంటూ కమలాకర్‌ ఫోన్‌ పెట్టేశాడు.

సోమేశ్వర్‌ తన ఎంగేజిమెంట్స్‌ డైరీ తీసి చూశాడు. సెప్టెంబర్‌ 16ఖాళీగానే ఉంది. కాకపోతే 18వతేదీన హైదరాబాద్‌లో ఒక మీటింగుంది. 16న చెన్నైవెళ్ళి మళ్లీ 18న హైదరాబాద్‌ చేరుకోగలనా అని ఆలోచించటం మొదలెట్టాడు.ఈలోగా మళ్ళీ ఫోన్ మోగింది.‘‘16న ఖాళీగానే ఉన్నాను. కానీ 18న హైదరాబాద్‌ వెళ్ళాల్సి ఉంది’ సోమేశ్వర్‌ చెప్పడం పూర్తి చెయ్యకుండానే, ‘‘మిమ్మల్ని 16రాత్రే ట్రైనెక్కిస్తాం సార్‌, మీరు 18న ఈజీగా హైదరాబాద్‌ వెళ్ళొచ్చు. 16న ఆదివారం కాబట్టి మీటింగ్‌ ఉదయం పదిగంటలకే ఉంటుంది. మీరు 15వ తేదీ శనివారం ఇక్కడికి రావలసి ఉంటుంది’’ అన్నాడు కమలాకర్‌.