ఒకానొకప్పుడు సుదర్భదేశాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన క్రమశిక్షణపాటించే మనిషి. పదవిలోకి వస్తూనే దేశంలో అవినీతి, నేరాలను అణిచివేయడానికి కఠినమైన శాసనాలు చేశాడు. తానే స్వయంగా వాటి అమలు పర్యవేక్షించేవాడు. అలా కొన్నాళ్లకు సుదర్భదేశంలో ఎక్కడా దొంగతనాలు, అవినీతికి తావులేకుండాపోయింది. ప్రజల జీవితం సుఖంగా గడిచిపోతోంది. సుభిక్షమైన, శాంతియుతమైన దేశంగా పేరు పొందింది సుదర్భ.
విశాలపురం సుదర్భదేశానికి రాజధాని. అక్కడ జయవర్ధనుడనే సుక్షత్రియుడు బ్రతుకుతెరువుకోసం చిన్న గురుకులాశ్రమం నెలకొల్పాడు. అందులో శిష్యులకు రాజనీతిలో, యుద్ధవిద్యల్లో శిక్షణనిచ్చేవాడు. జయవర్ధనుడి భార్య జయంతి. అంతా ఆమెను రూపగుణాల్లో ఆదర్శవతిగా చెప్పుకునేవారు. ఆ దంపతుల ఒక్కగానొక్క కొడుకు శూరవర్ధనుడు. అతడు చాలా తెలివైనవాడు. పన్నెండేళ్ల వయసుకే తండ్రి నేర్పిన విద్యలన్నింట్లో ఆరితేరగా, జయవర్ధనుడు అతణ్ణి మరిన్ని విద్యలు నేర్వమని వేరే గురువు వద్దకు పంపాడు.ఇరవై ఏళ్లొచ్చేసరికి శూరవర్ధనుడికి రానివిద్యంటూ లేదు. అప్పుడతడు రాజాశ్రయంకోసం వెడతానన్నాడు కానీ తండ్రి ఒప్పుకోలేదు. ఎందుకంటే శూరవర్ధనుడికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నది.
రాత్రి మంచినిద్రలో ఉన్నప్పుడు, ఉన్నపళంగా లేచి ఎక్కడికో వెళ్లిపోతాడు. చిన్నతనంలో అలా కొద్దిసార్లు జరిగిన తరువాత, తండ్రి అతణ్ణి గదిలోపడుకోనిచ్చి, బయటినుంచి తలుపులు వేసేవాడు. తెల్లవారి లేచి చూస్తే అతడు మంచంమీద కాక తలుపు దగ్గర పడుకుని ఉండేవాడు.రాజాశ్రయం లభిస్తే త్వరలోనే కొడుకు రాజుకు ప్రీతిపాత్రుడు కాగలడని జయవర్ధనుడికి నమ్మకముంది. కానీ రాజుకొలువులో ఒకోసారి రాత్రిబంవళ్లు రాజుని అంటిపెట్టుకుని ఉండాల్సి రావచ్చు. అలాంటప్పుడు నిద్రలోనడిచే అలవాటువల్ల రాజు అతణ్ణి అనుమానించవచ్చు. ఆగ్రహించవచ్చు కూడా. రాజుల సంగతి తెలియనిదేముంది. వారు ఆగ్రహానుగ్రహాలలో ఉచితానుచితాలు పాటించరు.