ఉదయాన్నే ఊరంతా దుర్గ గుడిసె ముందు గుమిగూడింది. తలనుంచి నడుంపైదాకా కొండయ్య శరీరం నీళ్ళలో మునిగి ఉంది. సగం శరీరం తొట్టి అంచుమీదనుంచి క్రిందికి వేలాడుతోంది. ‘‘నా మొగుణ్ణి చేతులారా నేనే చంపుకున్నాను దేవుడో!’’  ‘‘చేతులారా చేసుకున్నాను దేవుడో!’.. అంటూ ఏడుస్తూ మొగుడి పాదాల్ని ఆనుకుని కూచుంది దుర్గ. నలుగురైదుగురు ఆడవాళ్ళు. ఆమెచుట్టూ తోడుగా కూర్చున్నారు. ధైర్యం చెబుతూ, కన్నీళ్ళు తుడుచుకుంటున్నారు.

****************************

దుర్గ ముందుకి వంగి, పొయ్యిలోకి సత్తువకొద్దీ ఊదింది. పుల్లలు చిటపటలాడాయి. పొగ ఒక్కసారిగా ఆమె ముఖం మీదికి దాడి చేసింది. దగ్గు తెర లోపలినుంచి తన్నుకొస్తోంది. తలవాల్చి, ఉక్కిరిబిక్కిరిగా దగ్గుతూ, రెండుపిడికిళ్ళతో కళ్ళు రుద్దుకుంటూ ఉండిపోయిందామె. వంటపాత్రలో వేయడానికీ తనేతేవాలి. పొయ్యిలో పెట్టడానికీ తనేతేవాలి. అక్కడాఇక్కడా తిరిగి తను పోగుచేసితెచ్చే పుల్లలు అంతే...పొగ ఎక్కువ, మంట తక్కువ! తన మొగుడిలాగే; ఉసులెక్కువ; ఉయోగం తక్కువ...

 

 

‘‘దుర్గీ! ఏయ్‌ దుర్గీ!’’ కొండయ్య అరుపులాంటి పిలుపు పూరిగుడిశెలోకి దూసుకొచ్చింది.తన మొగుడికి నూరేళ్ళు...గుండెలో అనుకుంటే గుమ్మం ముందున్నాడు.‘‘ఏంజేస్తున్నావే కొంపలో! ఇట్టా తగలడు!’’ కొండయ్య కంఠం ఖంగుమంది.పుల్లల్ని పొయ్యిలోపలికి ఎగదోసి, మోకాళ్ళమీద చేతులు ఆనుకుని లేచింది దుర్గ. పొగ మేఘంలా పాకంతా వ్యాపించింది. పొగను చేత్తో అటూఇటూ తోస్తూ, రెప్పలు టపటపలాడిస్తూ గుమ్మం దగ్గరగా వెళ్ళింది దుర్గ.గుమ్మంలో అటువైపు తిరిగి నిలుచున్న కొండయ్య గాలికి ఊగే సరుగుడుచెట్టులా ఊగుతున్నాడు. దుర్గకు తెలుసు. తన మొగుడు ఊగడం లేదు. అతనిలో దూరిన ‘చీపులిక్కరో’, నాటుసారాయో అతన్ని ఊపుతోంది.

దుర్గ చీరకొంగునోటికి అడ్డం పెట్టుకుని, దగ్గుతూ అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది.‘‘ఏంటే? కొంపని పొగగూడు చేసేశావ్‌? కట్టుకున్నోడు కాలు పెట్టకూడదనా?’’ కొండయ్య ఎర్రగాచూస్తూ అన్నాడు. ‘‘పొగకమ్ముకోకుండా వండలేవా, పిండాకూడు? నీ చేతులు కాలా?’’‘‘‌హు! నీ శాపం నిజమైపోయింది కదా! ప్రతీ పూటా ఏరితెచ్చిన పుల్లల్ని ఎగదోసెగదోసీ నా చేతులు కాల్తూనే ఉన్నాయి!’’ దుర్గ ఉక్రోషంతో అంది. ‘‘గౌర్మెంటోడిచ్చిన ‘దీపం’ గ్యాసుబండనీ తగలేసి తాగేశావు. గ్యాసుపొయ్యిని గుటకేశావు! పొగొస్తోందంటే రాదూ! పొగచూరిపోవాల్సిందేగదా మన బతుకులు!’’కొండయ్య ముందుకుతూలి, రెండుచేతుల్నీ ద్వారబంధానికి రెండువైపులా ఆన్చి, నిలదొక్కుకున్నాడు.

ఎరుపెక్కిన అతనికళ్ళు చింతనిప్పులయ్యాయి. ‘‘ఎర్రిబాగుల పెళ్ళామా! నీ మొగుడు గ్యాసుబండనూ, గ్యాసుపొయ్యినీ ఎందుకు అమ్మిపారేశాడో తెలుసా? గ్యాసుబండ పెమాదమే! అది పేలిపోయి, కొంపకాలిపోయి, మనందరం చావకుండా ఉండటానికి ముందుచూపుతో అమ్మిపారేశానే! ఆ సొమ్ముతో నీకు సొమ్ములు కొనలేంగదే! అందుకని నాల్రోజులు దప్పిక తీర్చుకున్నాను!’’