పిల్లలు మా మాట వినడంలేదని తల్లిదండ్రులు తరచు వాపోతూ ఉంటారు. ఈ కథలో రవి మాత్రం అలాంటివాడు కాదు. తండ్రి చెప్పింది తూ.చ తప్పక ఆచరిస్తాడు. దానివల్ల ఆ తండ్రికి తంటాలు కూడా వచ్చేవి. వేళగానివేళ ఇంటినుంచి ఫోనొస్తే మళ్ళీ ఏం జరిగిందో అని ఆ తండ్రి బెంబేలెత్తిపోయేవాడు. అలాగే ఒకసారి అతడి భార్య టీ.వీలో వార్త చూసి ఏడుస్తూ ఫోన్‌ చేసింది. మరి ఈసారి ఆ కొడుకు ఏం ఘనకార్యం చేశాడో?

‘‘రవి ఎలా ఉన్నాడో ఏంటో! ఒకసారి ఫోన్‌ చేయలేకపోయారా?’’ అంది నా శ్రీమతి సుజన.చదువుతున్న పేపరు పక్కనపెట్టి ‘‘అలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్‌ చేయడానికి ఆ కాలేజీ వాళ్ళు ఒప్పుకోరే... వారానికి ఒకసారి మాత్రమే అనుమతి ఇస్తారు. అదికూడా ల్యాండ్‌లైన్‌కే ఫోన్‌ చేయాలి, పిల్లలకి సెల్‌ఫోన్‌ ఇవ్వద్దని ప్రిన్సిపల్‌ ఆర్డర్‌ వేశాడు. అయినా వాడేం చిన్నపిల్లాడా ఏంటి.. బాగానే ఉండి ఉంటాడులే’’ అన్నాను.‘‘చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వాడు మనల్ని విడిచి ఉండలేదు. ఇక్కడ కూడా మంచి కాలేజీలే ఉన్నాయి కదా, మరి వాడిని తీసుకువెళ్ళి ఎక్కడో విజయవాడ దగ్గర చేర్పించడమెందుకు’’ కాస్త కోపంగానే అడిగింది నా ఇల్లాలు.

‘‘వాడి బాగుకోసమేకదా చేర్పించింది, అక్కడ చదివితే మంచి పొజిషన్‌కి వెడతాడు. ఆ కాలేజీలో చదువు బాగా చెప్తారు. మనబ్బాయి ప్రయోజకుడైతే మనకే కదా ఆనందం. ఇక్కడుంటే స్నేహితులు, సరదాలు అంటూ తిరిగి చదువు నెగ్లెక్ట్‌ చేయవచ్చు. ఒక్కడేబిడ్డ కదా అని మనం భయం చెప్పలేకపోవచ్చు. కాని అక్కడ అలా కాదు. మంచి డిసిప్లిన్‌ నేర్పిస్తారు. ఎంత, రెండేళ్ళు. కళ్ళుమూసి తెరచేలోగా ఇంటర్‌ పూర్తవుతుంది. ఆ తరువాత ఇంజనీరింగ్‌లో చేరాలని వాడి కోరిక, మనకోరికా కూడానూ. అక్కడ స్నేహితులు పరిచయమైతే నెమ్మదిగా వాడే సర్దు కుంటాడు. నువ్వు అనవసరంగా బెంగపెట్టుకుని నన్ను ఇబ్బందిపెట్టకు’’ అని చెప్పాను. ఆమె ఇక ఏం మాట్లాడకుండా విసవిసా వంటగదిలోకి వెళ్లిపోయింది.