పాల్ఘాట్‌ అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబీకుడు మణిశంకర్‌ అయ్యర్‌. ముగ్గురు ఆడపిల్లలు సహా నలుగురు సంతానం. వ్యాపారంలో చితికిపోయాడు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలో తెలియక నిత్యం కలవరపడేవాడు. అప్పుడే నంబి అయ్యర్‌ ద్వారా తీపి కబురు తెలిసిందతడికి. దాంతో అతడి కుమార్తె పూర్ణి, తెలుగునాట మెట్టినింట అడుగుపెట్టి పూర్ణగా అవతరించింది. ఆమె గురించి చెప్పాలంటే...

పూర్ణానది ఒడ్డున కనుచూపుమేరలో నాలుగిళ్ళ మండువాలోగిలి.కొబ్బరిచెట్లమధ్య కనిపించీ కనిపించకుండా ఉంది. తీరా వెళ్ళి చూస్తే, ఒక్క కొబ్బరిచెట్లేమిటి..పనస, మామిడిచెట్లు ఒకవైపు, అరటిపొదలు మరోవైపు. వాటిమధ్య గుంభనంగా, నిండుగా పెద్ద పెంకుటిల్లు. వరండా అంతా భగవతి చిత్రపటాలతో, వేలాడే కంచుదీపాలు, నిలువెత్తు ఇత్తడి దీపస్థంభాలతో... కసావు నేత చీరకట్టి, కాసులపేరు, మామిడిపిందెల హారం ధరించి కాసంత కుంకుమను నుదుటన దిద్దుకున్న ప్రౌఢను తలపిస్తోంది.

పెంకులపైకి వాలిన మామిడికొమ్మలు. అమ్మఒడి నుండి జారి, అరుగుపై ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న పాపాయిల్లా... కొమ్మలచివరలనుండి పెంకులపైకి వాలుతూ, ఎగురుతూ చిన్నపక్షులు కలకలం సృష్టిస్తున్నాయి.ఇంటికి కుడివైపు అరటిపొదల వెంట ఒక చిన్నకాలిబాట. అది ఆ రెండెకరాల ప్రాంగణంలోని ఇంటి పెరటిలో ఓ మూలవున్న పెరటి కొలనుకు దారి చూపిస్తోంది.విరగకాచిన జాపత్రి చెట్టు, సగం విచ్చిన ఫలాలలో వగరు సౌగంధాన్ని విరజిమ్ముతోంది. పోకచెట్లను అల్లుకున్న మిరియాల తీగలు, ఇంతింతేసి ఆకుల కళ్ళతో ఆరిందాల్లా చూస్తున్నాయి.ఆ బాట వెంట నెమ్మదిగానైనాసరే, స్థిరంగా పడుతున్న అడుగులతో తొమ్మిదేళ్ల బాలిక పూర్ణి. బంగారు జరీఅంచున్న మీగడరంగు పావడా, ఎర్రరవికెతో, తెల్లని ఉదయపు సూర్యరశ్మితో మెరిసే ఎర్రమందారంలా కనిపిస్తోంది.

వదులుగా వీపంతా పరచుకున్న బారెడంత నొక్కుల జుట్టు, అంచుల్లో ముడివేసుకుని అందులో తురుముకున్న సూర్యకాంతి పూలు.ఆ అమ్మాయి కొలనుదాకావచ్చి గట్టున కూర్చుంది. మెల్లగా కొలనులోకిదిగి ఈదుకుంటూ వెళ్లి తెల్లతామరపూలని కోసింది. తిరిగి వచ్చేసి, ఇంట్లో పూజకోసం కొన్ని తామరపూలని వరండాలోని కొమ్మచెంబులో ఉంచి, మిగతాపూలు తీసుకుని పూర్ణానది ఒడ్డుకు వచ్చింది.ఆ నది పక్కగా చీలి ప్రవహిస్తున్న చిన్నపాయను ఈదుకుంటూ వెళ్లి, అక్కడున్న భగవతి అమ్మవారి చిన్నగుడిమెట్లన్నీ ఎక్కి, మూడుసార్లు గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసింది. అమ్మవారి పాదాలచెంత ఆ తెల్లతామరపూలు ఉంచింది. పూజారి ఇచ్చిన చిన్న అరిటాకుముక్కలోని పుష్పాంజలిని అందుకుని కళ్ళకు అద్దుకుని ఆ గంథం, కుంకుమ నుదుట దిద్దుకుని, తిరిగి ఆ పూర్ణానది పాయలో ఈదుకుంటూ ఈవల ఒడ్డునవున్న ఇంటికి చేరింది. ఇదీ ఆ అమ్మాయి నిత్యకృత్యం.