ఆఫీసు నుంచి వచ్చాక వంట పనిలో నిమగ్నమయ్యాను.ముంబయ్‌ నుంచి ఫోన్‌కాల్‌. మీనాక్షిపిన్ని ఊళ్ళోకి వస్తున్నానని చెప్పింది. చాలా ఏళ్లయింది పిన్నిని చూసి. ఆవిడకోడలు వీణ పుట్టింటివాళ్ళు, ఈ మధ్యనే ఇక్కడ మేముండే ఊళ్లోకి వచ్చి స్థిరపడ్డారని చెప్పింది.ఒక్కసారిగా నా ఆలోచనలన్నీ నా చిన్నప్పటి రోజుల్లోకి పరుగులు తీశాయి.

మీనాక్షి పిన్ని భర్త గోపాల్‌బాబాయ్‌గారు. ముంబయ్‌ నగరంలో పెద్ద హోదాలో పనిచేశారు. ముగ్గురు మగపిల్లలు. బాగా చదువుకున్నారు. తండ్రికి తగినట్టు మంచిహోదాల్లో ఉన్నారు. మీనాక్షిపిన్నిని ఎక్కువగా ముంబయ్‌ పిన్ని అనే వ్యవహరించేవాళ్ళు బంధువులంతా. భర్తహోదా, ఆమె నగరజీవితపు ఆకర్షణలతో బంధువులందరిలో కాస్త ఎక్కువప్రత్యేకత చూపిస్తుండేది ఆవిడ.అమ్మమ్మ, తాతయ్య లేకపోవటంతో ఇద్దరు పిన్నులు, మామయ్య, వాళ్లపిల్లలు అందరూ సెలవుల్లో తమ ఇంటికే వచ్చేవారు. ముంబయ్‌ పిన్ని వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి స్నానాలు, భోజనాల దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించేది. ముంబయ్‌లో తమ ఔట్‌హౌస్‌లో వంటమనిషి కూతురు ఆ పిల్లలపనుల్లో సాయంచేస్తుందని ఆమెని తనతోకూడా తీసుకొచ్చేది.

మిగిలినపిన్ని, మామయ్యల పిల్లలతో మేమంతా డాబామీద, క్రిందహాల్లోనే పక్కలేసుకుని పడుకుంటే, ఆవిడపిల్లలు గదుల్లో మంచాలమీదతప్ప పడుకునేవారుకాదు. పాపం, వాళ్లకి మాతో కలిసి పడుకోవాలనీ, మాతో కబుర్లు చెప్పుకోవాల ఉండేదేమోగానీ, పిన్నివాళ్లని కలవనిచ్చేది కాదు. ఆవిడ కట్టే చీరలు, ఆ పిల్లలబట్టలు అందరం కళ్లు విశాలం చేసుకుని చూసేవాళ్లం. అయినా అలా అందరం గమనించకపోతే ఆవిడ చిరాకు పడిపోయేది.అమ్మనిచూసి జాలి పడుతుండేది. ‘‘ఇంతమందినీ ప్రతీవేసవికీ రమ్మనిపిలుస్తాడు మీ ఆయన. ఇంతమందికి చాకిరీ ఎలా చేస్తున్నావే? నానాగోలగా ఉండే ఇంట్లో నెల్లాళ్ళు పిల్లలతో వేగటం అంటే కష్టంకాదూ?! ముగ్గురు ఆడపిల్లల్నికన్నావ్‌. ముందుముందు బోలెడన్ని ఖర్చులుంటాయ్‌. ఓ నాలుగు రూపాయలు జాగ్రత్త చేసుకోకుండా, డబ్బంతా ఇలా వేసవిఎండలకే తోడిపోస్తారేం?’’ అనేది.