బాల్యం నుండీ సాహిత్యంపట్ల, పుస్తక పఠనం పట్ల అభిరుచి కలిగిన రచయిత గొర్లి శ్రీనివాసరావుకు స్వామి వివేకానందే స్ఫూర్తి. ‘రామసేతు’ వివాదం తర్వాత ఆయన సీరియస్‌ రచయితగా మారారు. ఆయన తొలి నవల ‘సేతు రహస్యం’. అటు రైల్వే ఉన్నతాధికారిగా, ఇటు రచనా వ్యాసంగంలోనూ స్వల్ప కాలంలో ఎన్నో విజయాలు సాధించారు. నవ్య వారపత్రికలో యువతరానికి స్ఫూర్తినిచ్చే ‘మెయిన్‌టీన్‌’ వ్యాసాలు,‘నీవెనుక నేను’ సూపర్‌హిట్‌ సీరియల్‌ను వ్రాశారు. రచనలో సమాజహితం ఎంతో కొంతైనా ఉండాలని, మంచిని ప్రేరేపించే రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్న శ్రీనివాస్‌తో నవ్య నీరాజనం ఇంటర్వ్యూ ఈ వారం మీ కోసం...

బాల్యం

మా అమ్మ గొర్లి మంగమ్మ. నాన్న గొర్లి వీరరాజు. మా నాన్న, మా తాతయ్య కూడా రైల్వే శాఖలోనే పనిచేసేవారు. నేను కూడా చివరికి అదే వారసత్వంతో ఉన్నతాధికారి బాధ్యతల్లో కొనసాగుతున్నాను.బాల్యం నుంచే నాకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నా చిన్నతనంలో మా అక్కయ్య సాయి భువనేశ్వరి అప్పట్లోని అన్ని పత్రికలు చదివేది. నేను చందమామ, బాలమిత్రలు చదివే వాడిని. కాని అక్క చదివే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, యువ, ఇంకా ఎన్నో పత్రికలు పేజీలు తిప్పడం, అందులోని కార్టూన్లు, బొమ్మలు మాత్రమే చూసేవాడిని. సీరియల్స్‌ గురించి నాకు తెలియడం చందమామ ద్వారానే. తర్వాత కథ ఏమవుతుందో తెలుసుకోవడానికి ఒక నెల వేచి ఉండాల్సి వచ్చేది. అవి చదువుతూ అద్భుతమైన ఫాంటసీ ప్రపంచంలోకి వెళ్లిపోయే వాడిని. అక్క చదివే పత్రికలలోని సీరియల్స్‌ నాకు మింగుడు పడేవి కాదు. అయితే వాటిల్లో ‘జరిగిన కథ’ అనేది చూసి మా అమ్మకు చెప్పే వాడిని, ‘అమ్మా ఆ కథ నిజంగా జరిగిందే తెలుసా’ అని. వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఎందుకు నవ్వుకునే వాళ్ళో అప్పట్లో తెలిసేది కాదు.

అయిదవ తరగతి వరకూ నా బాల్యం రాజమండ్రిలోనే గడిచింది. అప్పటివరకు రైల్వే గార్డుగా పనిచేస్తున్న నాన్నగారికి విశాఖపట్నం బదిలీ అయింది. దాంతో రాజమండ్రిని, మా ఇంటి ఎదురుగా రామాలయం విడిచి వెళ్ళాలంటే బాధ అనిపించింది. సముద్రం, బీచి వంటివి చూడొచ్చనే ఆశతో వైజాగ్‌ వెళ్ళడానికే మొగ్గు చూపించాను.పాత మిత్రుల్ని తల్చుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. విచిత్రమేమిటంటే అప్పుడు దూరమయిన మిత్రులు ముఖలింగేశ్వరరావు, మధుసూదన వర్మలను వారిని నేను రైల్వేలో పనిచేస్తున్న సమయంలోనే కలుసుకోవడం.

అచంచల విశ్వాసం

విశాఖపట్నంలో ఇంటర్మీడియెట్‌ ఆర్నెల్లు చదివాక నాన్నగారి బదిలీతో మళ్ళీ రాజమండ్రి చేరాం. అక్కడ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చేరాను. పాత స్నేహితుల పునస్సమాగం,కొత్త స్నేహితుల కలయికతో ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఏర్పాటు చేశాను. జెఎన్‌టియు ప్రవేశపరీక్షలో మా కాలేజీలో నాకే అందరికంటే మంచి రాంక్‌ వచ్చింది. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుని చదవటం నాకు ఇష్టం. ఏదైనా విశ్లేషించి చదివే సామర్థ్యం నాలో ఉందని నేను కనుగొన్న కాలం అది. వైజాగ్‌ జీవితం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాని ఫలాలు నేను రాజమండ్రిలో పొందాను.అదేవిధంగా పదిహేడేళ్ళ వయసులో కాకినాడ ఇంజనీరింగ్‌ కాలేజీలో (ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌) చేరి తల్లిదండ్రులకు దూరంగా గడపడం వల్ల జీవితాన్ని ముఖాముఖీ ఎదుర్కోవడంవల్ల అచంచలమైన విశ్వాసం వచ్చింది.